Canada : బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడా సంచలన నిర్ణయం

Update: 2025-09-30 10:15 GMT

భారత్ తో సంబంధాలు పునరుద్దరిస్తున్న వేళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. భారత్ సహా విదేశాల్లో హత్యలు, దోపిడి, ఆయుధాలు, డ్రగ్స్ రవాణా వంటి నేర కార్యకలాపాలతో సంబంధం ఉన్న లారెన్స్ బిష్ణోయ్ , అతని గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరీ ప్రకటించారు. కెనడాలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకొని భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే కార్యకలాపాలకు స్థానం లేదని స్పష్టం చేసింది. NCP నేత బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేసిన బిష్ణోయ్ ముఠా..ఇటీవల కపిల్ శర్మ కేఫ్ పై రెండుసార్లు కాల్పులు జరిపింది. కెనడాతో పాటు విదేశాల్లో బిష్ణోయ్ ముఠా హింసాత్మక ఘటనలకు పాల్పడింది. కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన ఆస్తులు, వాహనాలు, స్థలాలను ప్రభుత్వం స్వాదీనం చేసుకునే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యక్రమాలకు నిధుల సేకరణ, వివిధ నేరాలకు సంబంధించిన కేసుల్లో బిష్ణోయ్ ముఠా సభ్యులను విచారించే అవకాశాలు ఉన్నాయి. కెనడాలోకి ప్రవేశించే బిష్ణోయ్ ముఠా సభ్యులపై ఆ దేశ పోలీసులు నిఘా ఉంచనున్నారు. 

Tags:    

Similar News