టిక్ టాక్ చూసి.. కార్ల దొంగతనాలు..
గేమింగ్ యాప్ లు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి;
గేమింగ్ యాప్ లు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో టిక్ టాక్ లో ఛాలెంజ్ లు, వీడియోలు కార్ల దొంగతనాలను గణనీయంగా పెంచుతున్నట్లు తేలింది. నగరంలో ఇటీవలి కాలంలో కార్ల చోరీలు పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బు కోసం దొంగతనాలు చేస్తే, ఇప్పుడు గేమ్ ఛాలెంజ్ లో భాగంగా చేస్తున్నారు. కొంత కాలంగా యువత కియా, హ్యుండాయ్ కార్లను దొంగిలించి జాయ్ రైడ్ లకు వెళుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఫలితంగా నగరంలో ఈ ఏడాది కార్ల దొంగతనాలు 19 శాతం పెరిగాయి. నగరంలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఈ ఏడాది 10,600 కారు దొంగతనాలు జరిగాయి. గత ఏడాది ఈ సంఖ్య 9వేలుగా ఉంది. ఒక్క ఆగస్టులోనే ఇవి 25 శాతం పెరిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టిక్ టాక్ లో కియా, హ్యుందాయ్ లోని కొన్ని మోడళ్ల కార్లను ఎలా దొంగిలించాలో చూపిస్తున్నారు. కీ లేకుండా ఎలా కారును స్టార్ట్ చేయాలి వంటి వివరాలను అందిస్తున్నారు. నగరంలో దొంగతనానికి గురైన కార్లలో ఐదో వంతు ఈ మోడళ్లే ఉంటున్నాయి. ఇలా దొంగతనాలకు పాల్పడి అరస్టైన వారిలో సగం మంది 18 ఏళ్లలోపు యువతే కావడం గమనార్హం.