China: ఆహార సంక్షోభం దిశగా..

వర్షాలు, వరదల దెబ్బకు మునిగిన పంటలు

Update: 2023-08-09 09:30 GMT

భారీ వర్షాలు, వరదలు చైనాను అతలాకుతలం చేశాయి. గత వారం చైనాలోని బీజింగ్‌ను ముంచెత్తిన భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 33 మంది మృతి చెందగా....18 మంది గల్లంతైనట్టు చైనా అధికారులు వెల్లడించారు.ఈ వర్షాలు, వరదలు ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయని చైనా భావిస్తోంది. చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదల్లో మునిగిపోవడంతో ఆహార ధాన్యాల సాగు దెబ్బతింది. పొలాల్లోకి భారీగా వరద నీరు నిలిచిపోయింది.

గత కొంత కాలంగా చైనాను తరచూ ప్రకృతి విపత్తులు చుట్టుముడుతున్నాయి. ఈమధ్యనే వరదలు బీభత్సం సృష్టించాయి. అత్యధికంగా బీజింగ్‌లోని పశ్చిమ శివారు జిల్లా మెంటౌగౌను వరద అతలాకుతలం చేసింది. దాదాపు 35వేల ఇళ్లు దెబ్బతినగా.....3లక్షల10 వేల మంది నివాసితులపై ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. డోక్సూరి తుపాను సృష్టించిన ప్రళయం కారణంగా బీజింగ్ 140 ఏళ్లలో లేనంతగా అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసింది.


ఈ వరదల కారణంగా దేశంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఇప్పుడు వరదల కారణంగా ఆహార సంక్షోభం కూడా అంతకంతకూ పెరుగుతోంది. పొలాల్లోకి వరద నీరు చేరింది. పంటలన్నీ నాశనమయ్యాయి.

కొత్త పంటలు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యింది. హీలాంగ్‌జియాంగ్, జిలిన్, లియోనింగ్ లను చైనా ధాన్యాగారంగా పిలుస్తారు.

ఈ మూడు ప్రావిన్సుల్లోనూ సాగు భూమి చాలా సారవంతమైనది. దేశంలోని ఆహార ధాన్యాలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. సోయాబీన్స్, మొక్కజొన్న, వరి మొదలైనవి ఈ మూడు ‍ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూడు ప్రావిన్స్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలో ఆహార సంక్షోభం సంభవించవచ్చనే భావిస్తున్నారు.


వరదల దెబ్బకి కూరగాయల ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. వర్షాలు, వరదల కారణంగా దేశంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోధుమల దిగుబడి కూడా తగ్గింది. గత ఏడాది తీవ్రమైన ఎండలలు పంట నష్టానికి కారణం అవ్వగా, ఈ ఏడాది వరదలు విధ్వంసం సృష్టించాయి.

Tags:    

Similar News