HAITI: హైతీలో చెలరేగుతున్న సాయుధులు
రాజధాని పోర్ట్-ఒ-ప్రిన్స్‌ను దిగ్బంధించి దాడులు చేస్తున్న సాయుధులు... భయాందోళనల్లో సామాన్యులు;
హైతీలో సాయుధ ముఠాల దాడులు తీవ్రమయ్యాయి. హైతీ రాజధాని పోర్ట్-ఒ-ప్రిన్స్‌కు దారి తీసే మార్గాలు క్రిమినల్ గ్యాంగుల చేతిలోకి వెళ్లిపోయాయి. చాలా మంది ఇళ్లను వదిలి వలస వెళ్లిపోతున్నారు. సమారు 3లక్షల62 వేల మంది వలస బాట పట్టినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ వెల్లడించింది. హైతీలో ప్రజలు గౌరవప్రదంగా జీవించలేకపోతున్నారని నిత్యం భయం గుప్పిట గడపాల్సిన పరిస్థితి నెలకొందని ఐవోఎం చీఫ్ బ్రాంచెట్ అన్నారు.క్రిమినల్ గ్యాంగుల భయంతో రాజధానిలోని వారు ఇళ్లకే పరిమితమయ్యారని తెలిపారు. ఎక్కడ చూసినా సాయుధ దుండగులే కనిపిస్తుండటంతో...ప్రజలు బయటకు రాలేకపోతున్నారన్నారు. నగరం పూర్తిగా సాయుధుల దిగ్బంధంలో ఉందని ఐవోఎం చీఫ్ తెలిపారు. ఇటీవల రెండు జైళ్ల పై సాయుధులు దాడులు జరిపి వేల సంఖ్యలో ఖైదీలు తప్పించుకోవడానికి కారణమయ్యారు.
దేశాధ్యక్ష భవనం సహా పలు కార్యాలయాలపై జరిగిన దాడులను భద్రతా సిబ్బంది తిప్పికొట్టారు. ఈ క్రమంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేషన్లను ఆక్రమించేందుకు తీవ్రస్థాయిలో దుండగులు ప్రయత్నం చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. హింస పెరగకుండా రాజకీయ సంస్కరణలు అమలు చేయాలని ప్రధాని ఏరియల్ హెన్రీని అమెరికా ప్రభుత్వం కోరింది.హింస చెలరేగినప్పుడు ఆయన కెన్యా పర్యటనలో ఉన్నారు. తాజాగా అమెరికా భూభాగమైన ప్యూర్టోరికోలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లోనే కెన్యా నేతృత్వంలోని అంతర్జాతీయ బలగాలు అక్కడికి వెళ్లాలని ఐరాస ఆదేశించినా దీనికి కెన్యా కోర్టులు అడ్డుపడ్డాయి. దేశంలో ఆహార దిగుమతులకు కీలకమైన విమానాశ్రయం మూతపడిందని స్థానికులు తెలిపారు. ఈ కారణంగా దోపిడీలు పెరిగినట్లు వెల్లడించారు. కొన్ని ఆస్పత్రులను సాయుధముఠాలు స్వాధీనం చేసుకోడం వల్ల నవజాత శిశువులతో సహా సిబ్బంది, రోగులు ఆస్పత్రులను ఖాళీ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రాథమిక వైద్యానికి సైతం వైద్యులు కరవైనట్లు స్థానికులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
హైతీ రాజధాని పోర్ట్-ఒ-ప్రిన్స్‌లో సాయుధులు చెలరేగిపోతున్నారు. నగరానికి వచ్చే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి ఆగడాలు మితిమీరడంతో లక్షల మంది నగరాన్ని వీడుతున్నారు. పోర్ట్-ఒ-ప్రిన్స్‌లో పూర్తిగా భీతావాహ పరిస్థితి రాజ్యమేలుతున్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ వెల్లడించింది. హైతీలో శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధానిని అమెరికా ప్రభుత్వం కోరింది.