ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి : who
కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్..;
కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.. ఆ దిశగా ఆశలు రేకెత్తుతున్నాయని చెప్పారు. కరోనావైరస్ కట్టడిపై రెండు రోజులపాటు జరిగిన గ్లోబల్ హెల్త్ బాడీ ఎగ్జిక్యూటివ్ బోర్టు ముగింపు సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ ప్రకటన చేశారు. యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేచి చూస్తోందన్నారు.. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. ఆ దిశగా దేశాధినేతల హామీ ఈ తరుణంలో అత్యవసరమని టెడ్రోస్ అధనామ్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔషధ కంపెనీలకు వ్యాక్సిన్ విషయంలో ఆయా దేశాలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి. లక్షలాది మందిని బలితీసుకున్న కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు రష్యా మినహా ఏ వ్యాక్సిన్ అభివృద్ధి కాలేదు.. అదే సమయంలో క్లినికల్ ట్రయల్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.. టీకాలు తీసుకున్న వారిలో కోవిడ్‌ను అడ్డుకునే యాంటీబాడీలు ఏ మేర అభివృద్ధి చెందాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి పరిశోధన సంస్థలు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచ దేశాలు ఇప్పటికే కోవాక్స్ పేరుతో కూటమి కట్టాయి. ప్రస్తుతం ఈ కూటమి ఆధ్వర్యంలో 9 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న టీకాపైనే అందరి దృష్టి ఉంది.
వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలు కొంత ఊరట కలిగిస్తున్నా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.. అంతు చిక్కని రీతిలో కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండటమే ఇందుకు కారణంగా కనబడుతోంది. రెండోసారి వైరస్ సోకితే తక్కువ ప్రభావం చూపుతుందనే వాదనకు బలం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబాడీస్ ఉన్నప్పటికీ రెండోసారి సోకినపుడు కొందరిలో మొదటిసారి కన్నా ఎక్కువ తీవ్రత కనిపించినట్లు పరిశోధనల్లో తేలింది. ముంబైలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఢిల్లీలోని సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధకులు నిర్వహించిన అద్యయనంలో ఈ వివరాలు తెలిశాయి. అయితే, కరోనా రీ ఇన్ఫెక్షన్ సంఘటనలకు సంబంధించిన ఆధారాలు అత్యంత అరుదుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మొత్తంగా యాంటీ బాడీస్ తక్కువ కాలమే ఉంటే వారికి భవిష్యత్తులో మరోసారి కరోనా సోకడం సాధారణ విషయం అవుతుందనేది అధ్యయనాల సారాంశంగా కనబడుతోంది.