Terror Attack : సిరియాలో కారు పేలుడు
19 మంది మృతి, వందలాది మందికి గాయాలు;
ఉత్తర సిరియాలో సోమవారం ఉదయం ఘోర బాంబు పేలుడు సంభవించింది. మన్బిజ్ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 19 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది మహిళలు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పేలుడు తీవ్రతతో చుట్టుపక్కల భవనాలు కంపించాయి. పేలుడు స్థలంలో రక్తంతో తడిసిన మృతదేహాలు రోడ్డుపై పడిపోయాయి. హుటాహుటిన రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. ఒక నెలలోపే ఇది మన్బిజ్‌లో జరిగిన ఏడవ కార్ బాంబు దాడిగా నమోదైంది. గత శనివారం కూడా ఇలాంటి పేలుడులో నలుగురు మరణించారు, తొమ్మిది మంది గాయపడ్డారు.
ఈ పేలుడుపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద గ్రూప్ బాధ్యత వహించలేదు. అయితే, టర్కీ మద్దతుగల గ్రూపులు (సిరియన్ నేషనల్ ఆర్మీ) మరియు అమెరికా మద్దతుగల కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
సిరియాలో గతేడాది డిసెంబర్‌లో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ పదవీచ్యుతుడైనప్పటి నుంచి దేశం అంతటా అశాంతి నెలకొంది. సైనిక, ఉగ్రవాద దాడులు పెరిగిపోతుండటంతో పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ తరచూ జరుగుతున్న దాడుల వల్ల స్థానిక ప్రజలు తమ భద్రతపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిరియాలో హింసను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇటువంటి ఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.