అధ్యక్షుడిగా ట్రంప్ చివరి ప్రసంగం.. 150 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా..
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిపై ట్రంప్ మరోసారి విచారం వ్యక్తం చేశారు.;
అమెరికా చరిత్రలోనే వినూత్న పాలనను అందించిన అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ఇక ముగిసిపోయింది. మరికొన్ని గంటల్లో ఆయన శ్వేతసౌధాన్ని వీడనున్నారు. ఈ సందర్భంగా తన వీడ్కోలు సందేశాన్ని విడుదల చేశారు. చివరి ప్రసంగంలోనూ ఎక్కడా ఆయన బైడెన్ గెలుపును నేరుగా అంగీకరించలేదు. కేవలం కొత్తగా వచ్చే పాలకవర్గానికి శుభాకాంక్షలు అంటూ సందేశాన్ని ముక్తసరిగా కానిచ్చేశారు. తన హయాంలో సాధించిన విజయాలను కొన్నింటినీ గుర్తుచేసుకున్నారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా భావిస్తున్నా.. ఈ అద్భుతమైన అవకాశాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్. ఈవారం కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుంది. అమెరికాను సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నానంటూ... వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయాణంలో అదృష్టమూ వారికి తోడుండాలని ప్రార్థిస్తున్నా అని ట్రంప్ శ్వేతసౌధంలోకి రానున్న బైడెన్ బృందానికి ఆహ్వానం పలికారు.
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిపై ట్రంప్ మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్ని సహించేదిలేదని వ్యాఖ్యానించారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడితో అమెరికావాసులంతా భయాందోళనకు గురయ్యారని తెలిపారు. రాజకీయ హింస అనేది అమెరికా విలువలపై దాడి చేయడంతో సమానమన్నారు ట్రంప్. ఇలాంటి ఘటనల్ని ఎప్పటికీ సహించలమేన్నారు. పార్టీలకతీతంగా మనమంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ట్రంప్. ఎలాంటి పక్షపాతం లేకుండా ఉమ్మడి లక్ష్యం కోసం కృషి చేయాలంటూ ట్రంప్ చివరి క్షణంలో ట్రంప్ సూక్తులు పలికారు.
భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 10:30 గంటలకు బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందే ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడి ఫ్లోరిడాలోని తన సొంత నివాసానికి వెళ్లిపోతున్నారు. 150 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా కొత్త అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి హాజరుకాకుండానే ట్రంప్ వెళ్లిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.