New York Shooting: న్యూయార్క్‌లో కాల్పులు.. పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..;

Update: 2025-07-29 03:00 GMT

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ ప్రాంతంలో జరిగిన భీకర కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీసు అధికారితో సహా ఐదుగురు మరణించారు. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. బ్లాక్‌స్టోన్, ఎన్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయాలు ఉన్న 44 అంతస్తుల కార్యాలయ భవనంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో షేన్ తమురా అనే 27 ఏళ్ల వ్యక్తి భవనంలోకి ప్రవేశించి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

తరువాత అతను తనను తాను కాల్చుకున్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కాల్పుల మోతతో అక్కడ ఉన్నవారంతా ప్రాణ భయంతో వణికిపోయారు. ఈ సంఘటన తర్వాత, ఎఫ్ బీఐ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎఫ్ బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంజినో తన బృందం యాక్టివ్ క్రైమ్ సీన్‌లో సహాయాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు. నిందితుడి ఉద్దేశ్యం ఏమిటి? అతను ఒంటరిగా ఉన్నాడా లేదా ఏదైనా నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతడు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించాడని, ఏఆర్‌ సైల్‌ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ బిల్డింగ్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్‌ ప్రధాన కార్యాలయం, హెడ్జ్ ఫండ్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో సహా అనేక ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. కాల్పుల ఘటనను న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 254 మాస్‌ షూటింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి.

Tags:    

Similar News