Australia: పబ్‌‌లోకి దూసుకెళ్లిన కారు

ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మృతి

Update: 2023-11-09 03:00 GMT

ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామీణ ప్రాంతంలోని ఓ పబ్‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు భారత సంతతి వ్యక్తులు చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులు అందరూ రెండు భారత సంతతి కుంటుంబాలకు చెందినవారని ఆస్ట్రేలియా మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ పబ్ లోని బీర్ గార్డెన్ లోకి ఓ వృద్ధుడు నడుపుతున్న కారు దూసుకెళ్లడంతో 9, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు భారతీయులు మృతి చెందారు.

వివేక్ భాటియా (38), ఆయన కుమారుడు విహాన్ (11), ప్రతిభా శర్మ (44), ఆమె కుమార్తె అన్వి (9), జతిన్ చుగ్ (30) ఆదివారం (నవంబర్ 5) సాయంత్రం రాయల్ డేల్స్ ఫోర్డ్ హోటల్ ఎదుట లాన్ పై ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లి ప్రయాణికులను ఢీకొనడంతో మృతి చెందారు. భాటియా భార్య రుచి (36), చిన్న కుమారుడు అబీర్ (6), 11 నెలల చిన్నారితో సహా మరో ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ఆ ప్రాంతానికి వచ్చిన సందర్శకులేనని విక్టోరియా పోలీస్ చీఫ్ కమిషనర్ షేన్ పాటన్ సోమవారం (నవంబర్ 6) మీడియా మీట్ లోచెప్పారు.

వైట్ బీఎమ్‌డబ్ల్యూ డ్రైవర్ మౌంట్ మాసెడాన్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తిని ప్రాణాపాయం లేని గాయాలతో ఆసుపత్రికి తరలించామని, అతనికి శ్వాస పరీక్షలు నిర్వహించగా అతను ఆల్కహాల్ సేవించ లేదని చెప్పారు. ఈ ఘోర ప్రమాదానికి వేగం కారణమా అని ఇప్పుడే చెప్పలేమని పోలీస్ చీఫ్ అన్నారు. పాయింట్ కుక్ కు చెందిన ప్రతిభా శర్మ, ఆమె లైఫ్ పార్ట్నర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆస్ట్రేలియన్ సిక్కు సపోర్ట్ గ్రూప్ కార్యదర్శి గుర్జిత్ సింగ్ ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

కొవిడ్ సమయంలో 2020 సమయంలో ప్రతిభా శర్మ వలంటీర్ గ్రూపులో చేరారని, క్వారంటైన్ లో ఉన్నవారికి ఆహారం, కిరాణా సామగ్రిని అందించడంలో సహాయపడ్డారని సింగ్ చెప్పారు. ఆమె విక్టోరియన్ పార్లమెంట్, స్థానిక కౌన్సిల్ కు కూడా పోటీ చేసింది. కమ్యూనిటీలకు సబంధించి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొందని మెల్‌బోర్న్‌కు చెందిన ఒక వార్తా పత్రిక తెలిపింది. కాళ్లు విరిగి, అంతర్గత గాయాలతో రాయల్ మెల్‌బోర్న్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న రుచి, ఆమె కుమారుడిని చూసేందుకు భాటియా తల్లిదండ్రులు భారత్ నుంచి విక్టోరియా వెళ్తున్నారు.

 


Tags:    

Similar News