గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ ను అంతమొందించినట్లు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైన విషయాన్ని నిర్ధారించింది. డెయిఫ్ లక్ష్యంగా గాజాలో చేసిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తమ నిఘా విభాగం అంచనాకు వచ్చిందని వెల్లడించింది. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్ డియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. 1980లో హమాస్‌లో చేరాడు. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్ బాధ్యతలను డెయిఫ్ చేపట్టాడు. గాజా టన్నెల్ నెట్‌వర్క్ నిర్మాణం వెనుక ఉన్నది ఇతడే. గతేడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై మెరుపు దాడికి అతడే మాస్టర్ మైండ్. డెయిఫ్ కోసం గాలిస్తున్న ఐడీఎఫ్ గాజాలో అతడి ఆచూకీని గుర్తించి హతమార్చింది.