Heavy Rains : ఎడారి దేశాల్లో వరదలు.. దేనికి సూచన?

Update: 2024-04-19 08:30 GMT

ఏప్రిల్ 15, 2024 గత సోమవారం నుంచి కురుస్తున్న వానలకు దుబాయ్ వణికిపోతోంది. దుబాయ్ స్తంభించిపోయి ప్రధాన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో 25 నిమిషాల పాటు కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నీటితో మునిగి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏడాదిన్నర కాలంలో కురిసేంత వర్షపాతం దుబాయ్ నగరంలో 24 గంటల్లోనే నమోదైందని తేలింది. సోమవారం రాత్రి ఈ వర్షం ప్రారంభమైంది. దుబాయిలోని రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయానికి ఇది మరింత తీవ్రమైంది. మొత్తంగా ఒక్కరోజే 14.2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. దుబాయ్ నగరం జలమయం కావడానికి ఈ కుండపోతే కారణం. మన హైదరాబాద్ లోనూ 8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన పడితే ఎన్నో ప్రాంతాలు మునిగిపోతుంటాయి.

యూఏఈ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పాఠశాలలను మూసివేసింది. ఉద్యోగులు రిమోట్ గా పని చేయాలని కోరింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప, ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ భారీ వర్షాలకు కారణం అరేబియా ద్వీపకల్పం గుండా ప్రయాణించి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీద ఏర్పడిన తుపాను అని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల యూఏఈ లోనే కాకుండా ఇతర గల్ఫ్ దేశాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఒమన్ లో వరదల కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అకాల, అసాధారణ వర్షపాతానికి కారణం గ్లోబల్ వార్మింగేనని వాతావరణ మార్పుల నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News