చైనాను వణికిస్తున్న కరోనా డెల్టా వేరియెంట్
Delta Variant: రష్యా నుంచి చైనాలోని నాన్జింగ్ నగరానికి వెళ్లిన ఒక విమానం ద్వారా డెల్టా వేరియంట్ డ్రాగన్ కంట్రీలోకి ఎంటర్ అయినట్లు ఆ దేశం భావిస్తోంది.;
Delta Variant: చైనాలో డెల్టా వేరియంట్ కలకలం రేపుతున్నది. రష్యా నుంచి చైనాలోని నాన్జింగ్ నగరానికి వెళ్లిన ఒక విమానం ద్వారా డెల్టా వేరియంట్ డ్రాగన్ కంట్రీలోకి ఎంటర్ అయినట్లు ఆ దేశం భావిస్తోంది. విమానాశ్రయంలో 9 మంది క్లీనర్ల నుంచి మొదలైన కరోనా క్రమంగా పెరుగుతోంది. క్లీనర్లలో కొందరికి లక్షణాలు కనపడడంతో జూలై 20 పరీక్షలు చేయించుకోగా.. వారికి డెల్టా వేరియంట్ సోకినట్టు తేలింది. అనంతరం వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇలా కేవలం 10 రోజుల్లోనే చైనాలోని 16 ప్రావిన్సులకు, వాటిలోని కనీసం 26 నగరాలకు వైరస్ విస్తరించినట్లు సమాచారం.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కున్నామని.. ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా సాధారణ స్థితికి చేరుకున్నామని చైనా గతంలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం డెల్టా దెబ్బకు మళ్లీ మునుపటి పరిస్థితి ఎదురైంది. డెల్టా బాధితులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చైనా వ్యాక్సిన్ కూడా డెల్టా వేరియంట్‌ను అడ్డుకోలేక పోతోంది. రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకుతుండటంతో మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది చైనా.
ప్రస్తుతం చైనాలో అనేక నగరాల్లో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ల దెబ్బకు కోట్లాదిమంది చైనీయులు ఇళ్లల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రజలకు మూడో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది.
ఇటు అమెరికాలో కూడా డెల్టా ఉధృతితో విలవిలలాడుతోంది. అగ్ర రాజ్యంలో జూన్ తర్వాత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. తాజాగా మరోసారి పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఒక్కరోజులో 92వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు అగ్రరాజ్యంలో ఇప్పటి వరకూ 50 శాతం మందికి కరోనా వ్యక్సిన్ వేశారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్ సర్కారు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై దృష్టిసారించింది. అయితే చాలామంది అమెరికన్లు టీకా వేయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో.. అందరూ టీకా వేయించుకోవాలిని బైడెన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక అమెరికా సైనికులకు కూడా టీకా తప్పనిసరి చేయాల్సిందిగా పెంటగాన్‌ను కోరారు. ఇక రెండు డోసుల టీకా తీసుకున్న వారికి మాస్కులు అవసరం లేదని.. గతంలో ప్రకటించిన అధికారులు. తాజాగా కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. రెండు డోసుల టీకా తీసుకున్నా మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ కూడా డెల్టా దెబ్బకు బెంబేలెత్తిపోతోంది. దేశంలో 55 శాతానికి పైగా ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేసినా.. బూస్టర్ డోసులు వేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి 60 ఏళ్లు దాటినవారికి మాత్రమే మూడో డోసు ఇస్తున్నారు. ఇక ఫిలిప్పీన్స్ కూడా డెల్టా వ్యాప్తి నేపథ్యంలో వచ్చేవారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతునట్లు తెలుస్తోంది.
జపాన్‌లో కూడా డెల్టా వేరియంట్ కేసులు భయ పెడుతున్నాయి. ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా డెల్టా వేరియంట్‌వేనని తేలడం అందరినీ భయపెడుతోంది. ఇప్పటికే టోక్యోనగరంలో చాలామంది అథ్లెట్లు వైరస్ బారిన పడ్డారు. రోజు వారీ కేసులు కూడా భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి కరోనా డెల్టా వేరియెంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది.