U.S : ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ.. చట్టవిరుద్ధంగా సుంకాలు.. యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు
టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా సుంకాలను పెంచినట్లు కోర్టు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. ఈ సుంకాలు అనేక దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబరు మధ్య వరకు కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీనివల్ల ట్రంప్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి అవకాశం లభించింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.
సుప్రీంకోర్టులో పోరాటం:
ఈ నిర్ణయంపై ట్రంప్ తన సోషల్ మీడియా 'ట్రూత్'లో తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ‘‘అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరికి అమెరికా విజయం సాధిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాలి, కానీ కోర్టు నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలే అత్యుత్తమ మార్గం’’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
భారత్‌పై పెరిగిన సుంకాలు:
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అమలులోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. ఇందులో భాగంగా బేస్‌లైన్‌గా 10 శాతం టారిఫ్‌లు విధించారు. భారత్‌పై తొలుత 26 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతోందని ఆరోపిస్తూ వాటిని 50 శాతానికి పెంచారు. ఈ నెల 27 నుంచి ఈ పెరిగిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి.