Indian Tourists : అమెరికాలో భారతీయుల హవా..పర్యాటక రంగంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా.

Update: 2026-01-23 05:30 GMT

Indian Tourists : అమెరికా వీధుల్లో ఇప్పుడు భారతీయుల హడావుడి మామూలుగా లేదు. గతంలో కంటే చాలా ఎక్కువ మంది భారతీయులు ఇప్పుడు అమెరికా టూరిజంపై మక్కువ చూపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అమెరికా పర్యాటక రంగానికి భారత్ ఇప్పుడు రెండో అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా అవతరించింది. బెంగళూరులో జరిగిన బ్రాండ్ యూఎస్‌ఏ ట్రావెల్ వీక్ సందర్భంగా ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ డిక్సన్ ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కరోనా సంక్షోభం తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు మళ్ళీ ఊపందుకున్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. 2019తో పోలిస్తే ఇప్పుడు అమెరికాకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 40 శాతం పెరగడం విశేషం. 2025 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 20 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు. వరుసగా రెండో ఏడాది కూడా పర్యాటకుల సంఖ్య 20 లక్షల మార్కును దాటడం భారత ట్రావెల్ మార్కెట్ సత్తాను చాటిచెబుతోంది. గతంలో అమెరికా పర్యాటక రంగంలో ఇతర దేశాలు ముందుండేవి, కానీ ఇప్పుడు భారత్ రెండో స్థానానికి చేరుకుని అగ్రరాజ్యానికి భారీ ఆదాయాన్ని అందిస్తోంది.

భారతీయులు ఇప్పుడు కేవలం న్యూయార్క్, కాలిఫోర్నియా లేదా ఫ్లోరిడా వంటి పాపులర్ నగరాలకే పరిమితం కావడం లేదు. ఒకసారి అమెరికా చూసిన వారు రెండోసారి వెళ్ళినప్పుడు అక్కడి మారుమూల నగరాలను, కొత్త డెస్టినేషన్లను కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. అమెరికాలోని టాప్-10 పర్యాటక ప్రాంతాల్లో ఇప్పుడు భారతీయులే ప్రధాన అతిథులుగా కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే టాప్-5 మార్కెట్లలో భారత్ చోటు సంపాదించుకుంది. మన పర్యాటకులు ఎక్కువ రోజులు అక్కడ ఉండటమే కాకుండా, క్వాలిటీ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇస్తూ భారీగా ఖర్చు చేస్తున్నారు. దీంతో అమెరికన్ టూరిజం ఇండస్ట్రీకి భారత్ ఇప్పుడు ఒక రన్ మెషిన్‎లా మారిపోయింది.

ఈ ఏడాది అంటే 2026 అమెరికా పర్యాటక రంగానికి ఒక మైలురాయి కానుంది. ఎందుకంటే జూన్-జూలై నెలల్లో ఫిఫా వరల్డ్ కప్ జరగబోతోంది. దీనితో పాటు అమెరికా ఆవిర్భవించి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్నాయి. చారిత్రాత్మక రూట్ 66 యానివర్సరీ వంటి కార్యక్రమాలు కూడా పర్యాటకులను ఆకర్షించనున్నాయి. ఈ మెగా ఈవెంట్లను చూడటానికి భారత్ నుండి రికార్డు స్థాయిలో జనం తరలివెళ్తారని అంచనా వేస్తున్నారు. అందుకే అమెరికా ప్రభుత్వం కూడా భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వీసా ప్రక్రియను మరింత సులభతరం చేసే ఆలోచనలో ఉంది.

భవిష్యత్తులో కూడా ఈ జోరు కొనసాగుతుందని ఫ్రెడ్ డిక్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2031లో రగ్బీ వరల్డ్ కప్, 2034లో వింటర్ ఒలింపిక్స్ వంటి భారీ క్రీడా వేడుకలు జరగనున్నాయి. ఈ కారణాల వల్ల రాబోయే పదేళ్లలో భారత్-అమెరికా మధ్య విమాన రాకపోకలు, పర్యాటక రంగం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. కేవలం విహారయాత్రలకే కాకుండా, వ్యాపార పనులు, ఉన్నత చదువుల కోసం వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతుండటం అమెరికాకు కలిసివచ్చే అంశం. మన వాళ్ళ ఖర్చు చేసే విధానం చూసి అమెరికా టూరిజం శాఖ ఇప్పుడు భారత్‌ను తమ గోల్డెన్ మార్కెట్‎గా అభివర్ణిస్తోంది.

Tags:    

Similar News