Sajeeb Wazed Joy: మా అమ్మను అప్పగిస్తే చంపేస్తారు, భార‌త్ కాపాడుతోంది

లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాలో ఉన్నాయని వెల్లడి

Update: 2025-11-19 06:30 GMT

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని బంగ్లాదేశ్‌కు అప్పగిస్తే అక్కడి మిలిటెంట్లు ఆమెను చంపేస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగిపోతోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత్‌ను హెచ్చరించారు.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజీబ్ మాట్లాడుతూ.. తన తల్లిని అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. తన తల్లిపై తప్పుడు కేసులు బనాయించారని, 17 మంది న్యాయమూర్తులను తొలగించి, పార్లమెంట్ ఆమోదం లేకుండానే చట్టాలను సవరించి విచారణ జరుపుతున్నారని విమర్శించారు. కనీసం డిఫెన్స్ లాయర్లను కూడా కోర్టులోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"భారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది. ఆమె బంగ్లాదేశ్ విడిచిపెట్టకపోయి ఉంటే, మిలిటెంట్లు ఆమెను చంపేసేవారు" అని సాజీబ్ అన్నారు. ప్రస్తుత యూనుస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హసీనా హయాంలో అరెస్టయిన వేలాది మంది ఉగ్రవాదులను విడుదల చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. బంగ్లా ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన తల్లిని అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ తిరస్కరిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News