US : చేత్తో బిర్యానీ తిన్న భారత సంతతి లీడర్.. అమెరికన్ల జాతి వివక్ష కామెంట్లు
కోటివిద్యలు కూటి కొరకే అంటారు మన పెద్దలు. ఐదు వేళ్ళు నోట్లోనే వెళ్ళడానికి అందరి తాపత్రయం. అలా ఐదు వేళ్ళతో అన్నం తిన్న పాపానికి తీవ్రమైన జాతి వివక్ష దాడిని ఎదుర్కొంటున్నారు అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత జోహ్రాన్ మమ్దానీ. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఎన్న జోహ్రాన్ మమ్దానీ ఇటీవల చేతితో భోజనం చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. అయితే మన అలవాటు ప్రకారం భోజనం చేయడం కొందరు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో జాత్యాంహకార వ్యాఖ్యలకు దిగారు.
కొంతమంది నెటిజన్లు జంతువులాగా తింటున్నారని కామెంట్ చేస్తే.. మరికొంత మంది ఇదో అనాగరిక చర్య అని విమర్వించారు. ఈ పరిణామం అమెరికాలోని సాంస్కృతిక అసహనంపై కొత్త చర్చకు దారితీసింది. భారత్ తో పాటు అనేక దక్షిణాసియా దేశాల్లో చేతితో భోజనం చేయడం సాధారణమైన విషయమే. అదొక సాంస్కృతిక సంప్రదాయం. భోజనానికి ముందు, తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం మన జీవనశైలిలో భాగం. ఆహారాన్ని స్పృశిస్తూ తినడం వల్ల రుచి మరింత పెరుగుతుందని.. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.