ఇజ్రాయెల్- హమాస్ మధ్య పరస్పర దాడులతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తార స్థాయికి చేరడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని మెుదటినుంచి ఖండిస్తున్న ఇరాన్ తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు. హెచ్చరికలు పంపింది. అధునాతనమైన హైపర్ సోనిక్ క్షిపణి ఫట్టా 2ను ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఇజ్రాయెల్‌తో ముస్లిం దేశాలు సంబంధాలు తెంచుకోవాలని.. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు.
ఒకవైపు హమాస్‌ను సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. మరోవైపు పరిష్కారం కోసం అమెరికాతో సహా పలు దేశాలు యత్నిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది వివాదం ముదురుతోంది. యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న కొద్దీ ప్రధానంగా పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో మెుదటి నుంచి హమాస్‌కు మద్దతు ఇస్తోన్న ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలకి హెచ్చరికలు పంపింది. ఇరాన్ మొట్టమొదటి అధునాతనమైన హైపర్ సోనిక్ క్షిపణి ఫట్టా 2నుప్రదర్శించి హెచ్చరికలు పంపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అషురా ఏరోస్పేస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని సందర్శించినప్పుడు దీనిని ప్రదర్శించారు. తమ వద్ద ఉన్న ఈ హైపర్ సోనిక్ క్షిపణి అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్నవాటి కంటే ఆధునాతమైనదని ఇరాన్ తెలిపింది. దీంతో పాటు మెహ్రాన్ మొబైల్ డిఫెన్స్ సిస్టమ్, అధునీకరించిన9వ ఆఫ్ డే సిస్టమ్, షాహెద్ 147 డ్రోన్‌లను ఆవిష్కరించారు. ఇరాన్ దేశీయంగా తయారు చేసిన ఈ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని జూన్ 2023లోనే ఆవిష్కరించారు.
మరోవైపు ఇజ్రాయెల్‌ను ఒంటరి చేసేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్‌తో మిగిలిన ముస్లిం దేశాలు సంబంధాలు తెంచుకోవాలని అయాతుల్లా అలీ ఖమేనీ కోరారు. ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్‌తో ఉన్న. రాజకీయ సంబంధాలు తెంచుకోవాలని పిలుపునిచ్చారు. కనీసం పరిమిత కాలానికైనా ఈ నిర్ణయం తీసుకోవాలని ఖమేనీ కోరారు. కొన్ని ఇస్లామిక్ ప్రభుత్వాలు ఇజ్రాయెల్ నేరాలను ఖండించాయని కొన్ని అలా చేయలేదనిఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇజ్రాయెల్‌కు చమురు, ఇతర వస్తువుల ఎగుమతి నిషేధాంచాలని... ఖమేనీ పునరుద్ఘాటించారు. గాజాపై దాడులను నిరసిస్తూ.. ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలంటూ ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చేసిన ప్రతిపాదనను అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ OIC సభ్యదేశాలు నిరాకరించాయి