Israel Hamas Conflict: రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

28 మంది మృతి;

Update: 2023-12-20 01:15 GMT

దక్షిణ గాజాలోని రఫా పట్టణంపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. భూతల దాడులు చేస్తునే బాంబుల వర్షం కురిపిస్తోంది. శరణార్థి శిబిరాలు, ఆసుపత్రుల సమీపంలోనూ దాడులు చేస్తోంది. ఆదివారం రాత్రి జబాలియాలోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 110 మంది మరణించారని ఇప్పటికే గాజా ఆరోగ్యశాఖ వెల్లడించగా తాజాగా మరో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ప్రకటించింది. 

హమాస్ అంతమే లక్ష్యంగా దక్షిణ గాజా పట్టణమైన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 28 మంది పాలస్తీనా ప్రజలు మరణించారని హమాస్ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. గత వారం ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వేలాది మంది ప్రజలు రఫాకు తరలివెళ్లారు. ఇప్పటికే అక్కడి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. శిబిరాల వద్ద సరాసరి 486 మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా దాడులతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

గాజా ప్రజలకు మానవతా సాయాన్ని అందించేందకు కాల్పుల విరమణ కోసం మరోసారి ఐక్యరాజ్య సమితి ఓటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ చీఫ్ జాన్ సాయర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఈ సారి ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని ముసాయిదా రూపొందించే దౌత్యవేత్తలు యోచిస్తున్నట్టు చెప్పారు. దీని వల్ల తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పారు. ఇంతకు ముందు కాల్పుల విరమణ కోసం UN ఓటింగ్ నిర్వహించగా....వీటో అధికారంతో ఆమోదం పొందకుండా అమెరికా అడ్డుకుంది.


అటు హమాస్‌కు నిధులు సమకూర్చుతున్న సుభి ఫెర్వానా అనే వ్యక్తిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్-IDF తెలిపింది. రఫాలోని ఓ ప్రాంతంలో ఫెర్వానా ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టినట్టు పేర్కొంది. ఈ తరహా ఫైనాన్షియర్ల ద్వారా హమాస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని....ఈ నిధులు రాకుంటే అవి కొనసాగవని IDF వెల్లడించింది. అటు వెస్ట్‌బ్యాంక్‌లో ఈ ఏడాది ఇద్దరు ఇజ్రాయెల్‌ పౌరులను చంపినట్టు అనుమానిస్తున్న వ్యక్తికి చెందిన అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసినట్టు IDF తెలిపింది. కూల్చివేత దృశ్యాలను విడుదల చేసింది. జుడియా, సమారియాల్లో వాంటెడ్ జాబితాలో ఉన్న 10 మందిని అరెస్టు చేసినట్టు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం వీరంతా హమాస్‌తో అనుబంధం కలిగి ఉన్నారని పేర్కొంది.

ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య దాడులు మొదలైన నాటి నుంచి 20 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో 12 వందల మంది తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్ తెలిపింది.

Tags:    

Similar News