ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో ( Saulos Chilima ) పాటు మొత్తం పదిమంది మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడుతో సహా పదిమంది మృతి చెందారని దేశ అధ్యక్షుడు లాజరత్ చక్వేరా వెల్లడించారు.
గల్లంతైన విమానం శకలాలను గుర్తించామన్నారు. తొలుత రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన సైనిక విమానం అదృశ్యమైంది. ఆ విమానం సుమారు 45 నిమిషాల అనంతరం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని తిరిగి వెనక్కి వెళ్లాలని ఏటీసీ సూచించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడి విమానం జాడ తెలియరాలేదు. దానికి రాడార్ తో సంబంధాలు కూడా తెగి పోయాయి.
సమాచారం అందగానే అధ్యక్షుడు లాజరస్ చక్వేరా బహమాస్ పర్యటన రద్దు చేసుకున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతికూల వాతావరణంలో గాలించగా విమాన శకలాలను గుర్తించారు.