అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. వాలెంటైన్స్ డే రోజు ప్రారంభించనున్న మోడీ

Update: 2024-02-09 06:04 GMT

అరబ్ కంట్రీ అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించబోతున్నారు. ప్రముఖ ట్రస్ట్ స్వామినారాయణ్ సొసైటీ దీనిపై అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ గుడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో మొదటి రాతి హిందూ దేవాలయంగా ప్రసిద్ధికెక్కనుంది.

ఈ హిందూ దేవాలయం అబు మురేఖా జిల్లాలో ఉంది. 27 ఎకరాల స్థలంలో నిర్మించారు. స్వామినారాయణ్ సంస్థ BAPS కు చెందిన ఆధ్యాత్మిక గురువు స్వామి మహంత్ స్వామి మహరాజ్ ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకున్నారు. ఆలయ ప్రారంభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ప్రధానమంత్రి హోదాలో యూఏఈలో నరేంద్ర మోడీ పర్యటించడం ఇది ఏడోసారి అని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయోధ్యలో (Ayodhya) రామమందిరం ప్రారంభంతో ఇప్పటికే హిందూ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మోడీ చేయబోతున్న ఈ పర్యటన భారత్‌, యూఏఈల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుందని విశ్లేషిస్తున్నారు హిందూత్వ వాదులు. హిందూత్వ విశ్వాసం ఎంత ప్రభావవంతంగా ఉందో చూపించే లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించామని BAPS తెలిపింది. సామరస్యాన్ని మరింత పెంపొందించడమే తమ ఉద్దేశమని స్వామి నారాయణ్ సంస్థ ఓ ప్రకటనలో వివరించింది.

Tags:    

Similar News