Trump-Modi: అక్టోబర్‌లో మోడీ-ట్రంప్ భేటీ..!
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో కలిసే ఛాన్స్
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మలేసియా వేదికగా జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు మోడీ రెగ్యులర్‌గా హాజరవుతుంటారు. అయితే ఈసారి ఈ సమావేశాలకు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ-ట్రంప్ కీలక సమావేశం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 26-28 మధ్య ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అనేక మంది నాయకులు హాజరవుతున్నారు. మోడీ-ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇద్దరి మధ్య సమావేశం ఉంటుందా? లేదా? అనేది ఇరు దేశాల నుంచి ఎలాంటి సమాచారం వెలువడ లేదు. అయితే ప్రస్తుతం సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణాన ఇద్దరి మధ్య భేటీ జరగొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇక ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతున్నట్లు ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలియజేసినట్లు మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. మోడీ పర్యటన అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా.. గతంలో రెగ్యులర్‌గా హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా పాల్గొంటారని సమాచారం. ఇక ఈనెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశానికి మోడీ అమెరికా వెళ్లనున్నట్లు ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే సెప్టెంబర్ 16న ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో తిరిగి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.