అందమైన ద్వీపం.. అడుగు పెడితే అడ్రస్ ఉండరు..

చుట్టూ నీళ్లు.. మధ్యలో ఓ చిన్న ద్వీపం. నీటిపై తేలియాడుతున్నట్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో..

Update: 2021-08-08 06:30 GMT

చుట్టూ నీళ్లు.. మధ్యలో ఓ చిన్న ద్వీపం. నీటిపై తేలియాడుతున్నట్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. ఇదే కాదు ఏ ద్వీపాన్ని చూసినా ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది. కానీ పొరపాటున కూడా పోవెగ్లియా ద్వీపానికి వెళ్లకండి. ఇక్కడికి వెళ్లిన వారు ఎవరూ ఇంతవరకు తిరిగి రాలేదట.

నీటిపై తేలియాడే అందమైన నగరం వెనీస్. ఇది ఇటలీలో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నగరానికి 16 కి.మీ దూరంలో ఓ అందమైన దీవి ఉంది. అక్కడ కూడా ప్రజలు నివసించేందుకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆ దీవికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. ఆఖరికి ప్రభుత్వ అధికారులు సైతం పోవెగ్లియా పేరు చెబితే పరిగెడుతున్నారు. ఎందుకు అంత భయపడుతున్నారు.. ఏమా కథ అని ఆరా తీస్తే..

పోవెగ్లియా దీవిని ఇటలీ ప్రజలు ఓ శవాల దిబ్బగా పేర్కొంటారు. 16వ శతాబ్ధంలో ప్లేగు వ్యాధికి గురైన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. సుమారు లక్ష మంది పైగా ప్రజలు ప్లేగు వ్యాధితో మరణించారని చెబుతారు. దీంతో శవాలను, వ్యాధి గ్రస్తులను పోవెగ్లియాలో వదిలేసింది ప్రభుత్వం. తిండి లేక, చికిత్స అందక రోగులు అక్కడే మరణించేవారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. అప్పట్లో పౌర హక్కుల సంఘాలు ఈ దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకించినా లాభం లేకపోయింది.

ఎన్నో పోరాటాల అనంతరం ప్రభుత్వం అక్కడ ఒక చర్చితో పాటు రోగులు ఉండేందుకు ఒక భవనం నిర్మించింది. కాలక్రమేణా ప్రజలు అక్కడ నివసించడం మానేశారు. పర్యాటకులు దీవిని సందర్శించడానికి వెళ్లినా మళ్లీ తిరిగి రాకపోవడంతో స్థానికులు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.

1920లో ప్రభుత్వం దీవిని మరొకసారి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. అక్కడ ఓ హాస్పిటల్ నిర్మించి అందులో ఓ డాక్టర్‌ని ఉంచినా లాభం లేకపోయింది. అతడు రోగులపై రకరకాల ప్రయోగాలు చేసి చంపేసేవాడు. అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని భయపడేవారు. డాక్టర్‌కూడా దీవిలోని టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో వారి నమ్మకం మరింత బలపడింది.

ఎవరెన్ని చెప్పినా అదంతా తూచ్.. ఓసారి వెళ్లాల్సిందే అని అనుకుంటే మాత్రం దరఖాస్తు పూర్తి చేయాల్పి ఉంటుంది. అక్కడ వారికి ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉండదని ముందే స్పష్టం చేస్తారు. అయితే దెయ్యాల కోసం అన్వేషించే వారికి మాత్రం ఇది ఫేవరేట్ ప్లేస్ అని చెబుతారు.

ప్రస్తుతం ఈ దీవిని లుగీ బ్రుగనరో అనే వ్యాపారవేత్త వేలం ద్వారా 7.04 లక్షల డాలర్లు పెట్టి 99 ఏళ్లకు లీజు తీసుకున్నారు. మరి దాన్ని రీమోడలింగ్ చేసి దయ్యాలు, భూతాలు లేవంటే పర్యాటక ప్రదేశంగా ఊపందుకుంటుంది.

Tags:    

Similar News