South africa : దూసుకొస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వందకు పైగా కేసులు
ప్రపంచానికి గత రెండేళ్లుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా.... మరో కొత్త రూపంలో దూసుకువస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.;
ప్రపంచానికి గత రెండేళ్లుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా.... మరో కొత్త రూపంలో దూసుకువస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వందకుపైగా , బొట్స్వానా, హాంకాంగ్‌లో పలు కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఈ కొత్త వేరియంట్ కు ఒమైక్రాన్ అని పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది. ఒమైక్రాన్ వేరియంట్... డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైందనే ప్రచారం జరుగుతోంది.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన B.1.1.529 రకం వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రభావిత ఆఫ్రికా దేశాల నుంచి విమాన సర్వీసులపై పలు దేశాలు నిషేధాన్ని ప్రకటించాయి. బ్రిటన్, సింగపూర్, మలేషియా, జపాన్, ఇజ్రాయిల్, ఇటలీ, జర్మనీ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఆరు ఆఫ్రికా దేశాల విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. అదే బాటలో యూరోపియన్ యూనియన్ కూడా నడుస్తోంది.
కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
.హైదరాబాద్ శివార్లలోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థులకు, ఐదు మంది టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఇక్కడ విదేశీ విద్యార్థులు కూడా చదువుతుండడంతో కొత్త వేరియంట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటు ఈ కొత్త వేరియంట్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడించిన N679K, N501Y లాంటి మ్యూటేషన్స్‌ని కూడా కలిగి ఉండటం ఇప్పుడు శాస్త్రవేత్తలను కంగారుపెడుతోంది.