Nobel Peace Prize: ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి
ఇరాన్ లో మహిళల అణచివేతపై గళం వినిపిస్తున్న నర్గీస్ మహమ్మది;
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు. గత కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇవాళ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించారు. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్గెస్ మొహమ్మది ఈ యేటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈరోజు నార్వే నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ఇరాన్‌లో మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ అన్న నినాదాంతో ఆమె ఉద్యమం నడిపారు. మానవ హక్కుల అడ్వకేట్‌గా ఆమె ఇరాన్‌లో పేరు పొందారు. అలాగే ఆమె ఫ్రీడం ఫైటర్ కూడా. టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో గత ఏడాది రాజకీయ ఖైదీలను బంధించారు, ఆ సమయంలో జరిగిన నిరసనల్లో మొహమ్మది పాల్గొన్నారు. వుమెన్-లైఫ్-ఫ్రీడం నినాదంతో ఆమె నిరసనలు చేపట్టారు.
51 ఏళ్ల నర్గీస్ మహమ్మది డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ కు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2022లో బీబీసీ టాప్-100 మహిళల జాబితాలోనూ ఆమె చోటు దక్కించుకున్నారు. ఛాందస వాద సిద్ధాంతాలతో పాలించే ఇరాన్ వంటి దేశంలో ఓ మహిళ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం అనేది ఆత్మహత్యా సదృశంగా భావించాలి. అలాంటి దేశంలోనూ ప్రాణాలకు తెగించి, తోటి మహిళల స్వేచ్ఛ కోసం నర్గీస్ చేస్తున్న పోరాటం అంతర్జాతీయంగా గుర్తింపుకు నోచుకుంది. ఇరాన్ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించినందుకు గాను ఆమెను 1998లో అరెస్ట్ చేయగా, ఆమె ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు విపత్కర పరిస్థితుల నడుమ మనుగడ కొనసాగించారు. ఆమెను దాదాపు 13 సార్లు ఇరాన్ సర్కార్ అరెస్టు చేసింది. అయిదు సార్లు ఆమెను దోషిగా నిర్దారించారు. ఆమెకు దాదాపు 31 ఏళ్ల జైలుశిక్షను వేశారు. 154 కొరడా దెబ్బలు కూడా కొట్టారు. ప్రస్తుతం మొహమ్మది ఇంకా జైలులోనే ఉన్నారు. మానవ హక్కుల కోసం ఆమె సాగించే పోరాటాలు ఇరాన్ ప్రభుత్వానికి కంటగింపుగా మారడంతో పలుమార్లు కోర్టులు శిక్షలు విధించాయి. నర్గీస్ మహమ్మది 'వైట్ టార్చర్: ఇన్ సైడ్ ఇరాన్స్ ప్రిజన్స్ ఫర్ ఉమెన్' పేరిట ఇరాన్ జైళ్లలో మహిళల దుర్భర పరిస్థితులను కూడా పుస్తక రూపంలో బయటి ప్రపంచానికి తెలియజేశారు.