నేపాల్ నూతన ప్రధానిగా కె.పి.శర్మ ఓలి ( KP Sharma Oli ) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవనం శీతల్ నివాస్‌లో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఓలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగం ప్రకారం.. ఓలి ప్రమాణ స్వీకారం అనంతరం 30 రోజులలోపు పార్లమెంటులో తన బలాన్ని నిరూపించాల్సి వుంది.
275 సీట్లు కలిగిన పార్లమెంట్ ప్రతినిధుల సభలో ఓలి విశ్వాసపరీక్షలో నెగ్గాలంటే కనీసం 138 ఓట్లు కావాల్సి వుంది. నేపాల్ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన ఓలికి భారత ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు శుభాకాంక్షలు తెలిపారు. 'ఇరుదేశాల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రజల పురోగతి మరియు శ్రేయస్సు కోసం పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని మరింత విస్తరించడానికి, సన్నిహితంగా పనిచేయడానికి ఎదరుచూస్తున్నాము' అని ప్రధాని మోడీ ( Narendra Modi ) ఎక్స్‌లో పేర్కొన్నారు.
నేపాల్ ప్రధానిగా నియమితులైన కె.పి.శర్మ ఓలికి భారత జాతీయ కాంగ్రెస్ తరపున శుభాకాంక్షలు అని ఖర్గే తెలిపారు.