Pakistan: పాక్‌ సైన్యం భారీ ఆపరేషన్‌.. సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడి

నాలుగు రోజులుగా ఆర్మీ భారీ ఆపరేషన్.. ఇళ్లల్లో నుంచి బయట అడుగుపెట్టని ప్రజలు

Update: 2025-10-01 07:45 GMT

బలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లు, మోర్టార్లు, శతఘ్నులతో కుజ్దార్‌ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంపై దాడి చేస్తోంది. సొంత ప్రజలపైనే సైన్యం విరుచుకుపడుతోంది. సైన్యం దాడితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎటునుంచి బాంబు వచ్చి మీదపడుతుందోననే భయంతో ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ టార్గెట్ ఉగ్రవాదుల ఏరివేతేనని సైనిక వర్గాలు వెల్లడించాయి.

సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్‌ తో ప్రజలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. ఇళ్లల్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆహార కొరతతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సైన్యం ప్రయోగిస్తున్న బాంబుల వల్ల పత్తి పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నాయి. ఛశ్మా ప్రాంతంలో శతఘ్నులు, మోర్టార్ల కారణంగా పలువురు పౌరులు మరణించినట్లు సమాచారం. బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జెహ్రీ ప్రాంతమంతా ఉగ్రవాదుల చేతుల్లో ఉందని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనే లక్ష్యంతో దాడులు చేస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News