Pennsylvania: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన విమానం
అమెరికాలో మరో విమాన ప్రమాదం..;
అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన విమాన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరువక ముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలో మరోసారి విమానం కూలిపోయింది. పెన్సిల్వేనియాలోని నివాస ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ సంఘటన పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్‌లో చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.
ఘటనా స్థలానికి సమీపంలోని పలు వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విమానం శిథిలాలు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి. విమానం ప్రమాదానికి గురైన వెంటనే అగ్నిమాపక దళం వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరిగి కూలిపోయిందని, కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని చెప్పారు. వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేటర్స్ ఆరా తీస్తున్నారు.