Ayushman Bharat: 70 ఏండ్ల పై బడిన వృద్ధులకు ఆయుష్మాన్’ నమోదుకు కేంద్రం కీలక ఆదేశాలు
పేర్ల నమోదు కోసం మొబైల్ యాప్..వెబ్ పోర్టల్;
70 ఏండ్లు, అంతకంటే పైబడిన వయస్సు గల వారికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలు దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ పథకం అమలుకు అర్హులైన వృద్ధుల పేర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్‌సన్ లేఖలు రాశారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధి పొందాలని భావించే సీనియర్ సిటిజన్ల పేర్ల నమోదు కోసం కేంద్ర ఆరోగ్యశాఖ ‘ఆయుష్మాన్ మొబైల్ యాప్’, వెబ్ సైట్‌లో Beneficiary.nha.gov.in అనే విభాగం ఏర్పాటు చేసింది. వీటిల్లో పేర్లు నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది. త్వరలో అమలు కానున్న ఈ పథకంలో అర్హుల నమోదు ప్రక్రియ నిత్యం జరుగుతుంది. ఇప్పటికే ఏబీ పీఎంజేఏవై పథకం కింద లబ్ధి పొందుతున్న ఫ్యామిలీలతోపాటు ఈ పథకం కింద లేని వారికీ వర్తిస్తుంది. 70 ఏండ్ల వయస్సు ఉండటమే ఈ పథకంలో పేరు నమోదుకు అర్హత అని పేర్కొంది. ఇతర బీమా పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న వారు కూడా దీంతో లబ్ధి పొందొచ్చు.