వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. జంగారెడ్డిగూడెం కేంద్రంలో కిలో పొగాకు రూ.352 రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేళ్లు రాగా 731 బేళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 27న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా రూ.341 పలికింది.
ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు.
అంతర్జాతీయ మార్కెట్ లో వర్జీనియా పొగాకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రస్తుత ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది కర్ణాటకలో కిలో ధర రూ.260 అత్యధికంగా పలికింది. అదే ధరతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరినా మొన్నటి వరకు కిలో ధర రూ. 210 కే కొనుగోలు చేశారు.