Sanae Takaichi: జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా సనా తకాయిచి!
షిగెరు ఇషిబా స్థానంలో ప్రధాని బాధ్యతలు
జపాన్ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సనా తకాయిచి (64) ఎన్నికై చరిత్ర సృష్టించారు. మంగళవారం పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. గత నెలలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
పార్లమెంటులోని 465 స్థానాలున్న దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనా తకాయిచికి 237 ఓట్లు లభించాయి. దీంతో ఆమె మెజారిటీ మార్కును సునాయాసంగా దాటారు. ఎగువ సభ ఆమోదం కూడా పొందిన తర్వాత, ఈ సాయంత్రం ఆమె జపాన్ 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చక్రవర్తిని కలిసిన అనంతరం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపడతారు.
చైనా విధానాలపై తీవ్ర విమర్శలు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందిన తకాయిచి, గతంలో హెవీ మెటల్ డ్రమ్మర్‌గా కూడా పనిచేశారు. అక్టోబర్ 4న అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. అయితే, ఆమె కన్జర్వేటివ్ భావాలు, పార్టీలోని నిధుల కుంభకోణం కారణంగా పాత మిత్రపక్షమైన కొమెయిటో పార్టీ సంకీర్ణం నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో ఎల్‌డీపీ.. సంస్కరణవాద, మితవాద పార్టీ అయిన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జేఐపీ)తో సోమవారం సాయంత్రం కొత్త పొత్తు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా తకాయిచి మాట్లాడుతూ "జపాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తానని, భావి తరాలకు బాధ్యత వహించే దేశంగా జపాన్‌ను తీర్చిదిద్దుతా" అని హామీ ఇచ్చారు. ఆమె సొంత పట్టణమైన నారాలో ఒక విశ్రాంత ఉద్యోగి మాట్లాడుతూ "ఆమె మహిళ అయినా చాలా గట్టి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఏది ఒప్పో, ఏది తప్పో స్పష్టంగా చెప్పగలరు" అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.