బంగ్లాదేశ్‌లో ఆగస్టు 15ను జాతీయ సంతాప దినంగా పాటించాలని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆమె తరఫున కుమారుడు సాజిబ్ వాజెద్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన విధ్వంసం, హింసాత్మక ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జాతిపిత బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని కోరారు. హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు.
బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం మొదటిసారిగా ఆమెపై న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. జులై 19న ఢాకాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గ్రోసరీ స్టోర్ యాజమాని అబు సయ్యద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఆమెపై హత్య కేసు నమోదైంది. ఆమెతోపాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ, మాజీ హోం మంత్రి, మాజీ ఐజీపీ, మాజీ డీబీ చీఫ్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
తన రాజీనామా వెనుక అమెరికా హస్తం ఉందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించినట్టుగా వస్తున్న కథనాలను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ కొట్టిపారేశారు. దీనిపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. ఇక రాజకీయ ఆశ్రయంపై వచ్చిన కథనాల్లోనూ వాస్తవం లేదన్నారు. తన తల్లి వీసాను ఎవరూ రద్దు చేయలేదని, రాజకీయ ఆశ్రయం కోసం అమె ఎక్కడా దరఖాస్తు చేయలేదని వివరించారు.