United States : అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. ఇద్దరు స్కూల్ విద్యార్థులు మృతి...
అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు స్థానికంగా విషాదాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా ఓ స్కూల్ ఆవరణలో కాల్పులకు తెగబడ్డాడు దుండగుడు. విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో పలు ఆయుధాలతో వచ్చిన దుండగుడు కిటీకీ ద్వారా పిల్లలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘోర సంఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా..పలువురు గాయాల పాలయ్యారు.
వివరాల ప్రకారం.. మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో ఉన్న ఓ క్యాథలిక్ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థన చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన కాల్పులు విషాదాన్ని నింపాయి. చిన్నారులే లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా... మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి కి తరలించారు. కాగా నిందితుడి వయసు 20 ఏళ్ల లోపే ఉంటుందని...కాల్పుల తరువాత నిందితుడు కూడా మరణించినట్లు మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా తెలిపారు.