Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభం.. క్యారెట్ @ 490, టొమాటో @ 150
Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి;
Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఉన్న ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు రూ.150కి విక్రయిస్తున్నారు.
కిలో ఉల్లిని రూ. 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు రూ.220కి విక్రయిస్తున్నారు. కిలో క్యారెట్ రూ.490కి విక్రయిస్తుండగా 250 గ్రాముల వెల్లుల్లిని రూ.160కి విక్రయిస్తున్నారు. ఉత్పత్తులను తీసుకురావడం, వాటిని సురక్షితంగా ఉంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని కూరగాయల విక్రయదారులు అంటున్నారు.
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, ఇంధన కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేయబడింది. అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది.
1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారి ద్వీప దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ మరియు ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది.
ఇదిలావుండగా, అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం రాజీనామా చేస్తానని ప్రధానికి తెలియజేశారు. నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఆందోళనకారులు విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టారు.
రాజపక్సే తన నివాసం నుండి పారిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లక్షల రూపాయల నగదును అధికారులు గుర్తించారు. ఈ నగదు మొత్తాన్ని కోర్టుకు అందజేస్తామని పోలీసులు తెలిపారు.