WAR: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
50మందికిపైగా పాలస్తీనియన్లు మృతి.... పారిపోతున్న ప్రజలు;
గాజాలో నక్కిన హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా... ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు చేస్తున్నాయి. ఇప్పటికే గాజాను తమ అధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్ సేనలు...మరికొన్ని ప్రాంతాల్లో హమాస్ సభ్యులు ఉన్నారన్న అనుమానంతో నిశితంగా తనిఖీలు చేస్తున్నాయి. అయితే... ఇజ్రాయెల్ బలగాలు తమ ప్రాంతాల్లోకి వస్తున్నారన్న సమాచారంతో శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులు...సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు...గాజాలో గతవారం శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిని... విచారకరమైన తప్పిదంగా ఇజ్రాయెల్ అంగీకరించింది..
హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా... ఇజ్రాయెల్ భూతల దాడులను ముమ్మరం చేసింది. హమాస్ మిలిటెంట్ల కోసం అంగుళం అంగుళం... నెతన్యాహు బలగాలు...జల్లెడ పడుతున్నాయి. గాజాపట్టీలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకరోజు వ్యవధిలో చాలామంది మరణించారని, అందులో మహిళలు, పౌరులు ఉన్నారని.... హమాస్ నేతృత్వంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాఘాజీ, బీట్ లాహియా, ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మంది మరణించినట్లు.. హమాస్ ప్రతినిధి వెల్లడించారు. బీట్ లాహియాలో 4నివాస భవనాలను పేల్చేయడంతో 30 మంది మరణించారని పాలస్తీనా మీడియా పేర్కొంది. ఒకే కుటుంబానికి చెందిన
12మంది మృతి చెందారని వివరించింది. ఖాన్ యూనిస్‌లోని అల్ అమల్ ఆసుపత్రికి సమీపంలోని అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో 10 మంది మరణించారని పాలస్తీనా రెడ్ క్రాస్ తెలిపింది. బురీజ్ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లకు ...తమ సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోందని...IDF ప్రతినిధి తెలిపారు. మూడో రోజులుగా జరుగుతున్న భీకరపోరాటంలో..... చాలామంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించారు. మరోవైపు... బురీజ్ ప్రాంతంలో వేలాది మంది శరణార్ధులు తలదాచుకుంటున్న శిబిరం వైపు ఇజ్రాయెల్ బలగాలు కదులుతుండడంతో... అక్కడి బాధితులు వేరే ప్రాంతాలకు....తరలిపోతున్నారు. శరణార్ది శిబిరాల్లో దాదాపు లక్షన్నర మంది పాలస్తీనియన్లు తలదాచుకుంటున్నారని... ఇజ్రాయెల్ సేనల దూకుడుతో వారు అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తోందని ఐరాస తెలిపింది. బురీజ్ శిబిరం శివార్లలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు.. తిష్ట వేసినట్లు హమాస్ సాయుధ విభాగం ఆరోపించింది. ఇప్పటికే ఉత్తర గాజాలో చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారగా...ఇప్పుడు మధ్య గాజా ప్రాంతాలపై IDF బలగాలు దృష్టి పెట్టాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు... బ్యూరీజ్, నుసిరత్, మఘాజీ పట్టణాల్లో నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తున్నాయి.