Donald Trump: శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. ! హమాస్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం.. ట్రంప్
ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ట్రంప్ సహా ప్రపంచ అధినేతలంతా ఒకే వేదికపై ఉండగా శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ఇకపై గాజాలో బాంబుల మోత, ఆకలి కేకలు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ వారం తిరగక ముందే ఇరు పక్షాలు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత హమాస్-ఇజ్రాయెల్ ఒకరికొకరు నిందించుకున్నారు. మీరు ఉల్లంఘించారంటే.. మీరు ఉల్లంఘించారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్‌ను పూర్తిగా నిర్మిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చాలా మంచిగా ఉంటుందని.. వారు బాగా ప్రవర్తిస్తారని శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వైట్‌హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ట్రంప్ మాట్లాడారు. శాంతి విషయంలో హమాస్ విఫలమైతే మాత్రం ఆ గ్రూప్‌ను పూర్తిగా నిర్మిస్తామని హెచ్చరించారు.
హమాస్ మంచిగా ఉంటే మంచిది.. లేదంటే నిర్మూలింపబడతారని పేర్కొన్నారు. హమాస్‌కు ఇరాన్ మద్దతు లేదని.. ప్రస్తుతం ఎవరి మద్దతు వారికి లేదని చెప్పారు. ఇప్పుడు వాళ్లు మంచిగా ఉంటే మంచిది.. లేదంటే తాను ఆదేశిస్తే రెండు నిమిషాల్లో ఇజ్రాయెల్ అడుగుపెడుతుందని తెలిపారు. హమాస్ చేయకూడని పనులు చేస్తోందని.. అవసరమైతే అంతర్జాతీయ దళాలు లోపలికి వెళ్లి పరిస్థితుల్ని సరిదిద్దుతామని పేర్కొన్నారు. అది చాలా త్వరగా.. చాలా హింసాత్మకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఆదివారం రఫా నగరంలో ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలపై హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ తర్వాత జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 80కు చేరింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండించింది. ఇజ్రాయెలే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపింది. రఫాలో జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని హమాస్ పేర్కొంది.