US: 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
ప్రపంచ వ్యాప్తంగా ఫొటో వైరల్
అగ్ర రాజ్యం అమెరికాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమ వలసదారుల్ని పట్టుకునే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అమానుష్య చర్యకు పాల్పడ్డారు. ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారిని అదుపులోకి తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారుల్ని పట్టుకుని సొంత దేశాలకు పంపేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్చి చంపారు. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.
తాజాగా మిన్నెసోటాలోని ప్రీస్కూల్ నుంచి ఇంటికి వస్తున్న ఐదేళ్ల లియామ్ రామోస్, అతని తండ్రిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. అయితే ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఫొటో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బాలుడు నీలిరంగు బబుల్ టోపీ ధరించి ఉండగా.. వెనుక నల్ల ముసుగు ధరించిన ఫెడరల్ ఏజెంట్ ఉన్నాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది అమానవీయ వలస వ్యతిరేక విధానాలకు సజీవ చిహ్నంగా ఉందని పేర్కొన్నారు.
అయితే లియామ్ రామోస్ కుటుంబం అమెరికాలో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా కాకుండా అధికారికంగానే ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే తండ్రి… బాలుడిని రోడ్డుపై వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పాఠశాల, కుటుంబ న్యాయవాది తీవ్రంగా ఖండిస్తున్నారు.
లియామ్ రామోస్.. కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పాఠశాల ముందు కాలులో లియామ్.. అతని తండ్రిని ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారని స్కూల్ సూపరింటెండెంట్ జెన్నా స్టాన్విక్ తెలిపారు. ఇక లోపల ఎవరైనా ఉన్నారా? చూడటానికి ఇంటి తలుపు తట్టమని అధికారులు బాలుడిని కోరారని… ఎరగా ఉపయోగించుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుందని పాఠశాల పేర్కొంది.
లియామ్ రామోస్ కుటుంబం 2024లో అమెరికాలోకి ప్రవేశించారని కుటుంబ న్యాయవాది తెలిపారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో లేరని.. ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. తండ్రి, కొడుకు ఇద్దరూ అమెరికాకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ద్వారా వచ్చారని.. అంటే అధికారికంగా క్రాసింగ్ పాయింట్ ద్వారా అమెరికాలోకి వచ్చారని న్యాయవాది మార్క్ ప్రోకోష్ పేర్కొన్నారు.