Maldives: భారత్‌కు రాగానే మారిన మాల్దీవులు అధ్యక్షుడి మాట తీరు

ఇండియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్ధమైనట్లుంది..;

Update: 2024-10-08 01:15 GMT

‘ ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇప్పుడు అకస్మాత్తుగా మాట మార్చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన మొయిజ్జుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇవాళ మొహమ్మద్ మొయిజ్జు భారత దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,ముయిజ్జుల సమావేశం జరిగింది.

సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తనని భారత్‌కు ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మాల్దీవులలో పర్యటించే వారిలో భారతీయులే అధికం కావడంతో వీరి సమావేశంలో టూరిజం అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తుంటారని.. భవిష్యత్తులో మరింత మంది సందర్శిస్తారని కోరుకుంటున్నానని మొయిజ్జు అన్నారు.

‘మాల్దీవులకు అవసరం వచ్చిన ప్రతిసారి భారత్ వెన్నంటి ఉంది. స్నేహ హస్తం అందిస్తోంది. అలాగే తమ దేశ ఆర్థికాభివృద్ధిలో భారత్‌ది ఎంతో కీలక పాత్ర’ అని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి మాల్దీవులకు అండగా నిలుస్తోన్న ప్రధాని మోదీతోపాటు భారతీయులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, మాల్జీవుల బంధం వందల ఏళ్ల నాటిదన్నారు. 

అప్పుడు ఏం జరిగిందంటే..

2023 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో మాల్దీవుల్లో ఇండియా వ్యతిరేక సెంటిమెంట్‌ని తీసుకువచ్చి ముయిజ్జూ గెలిచాడు. భారత్ విరాళంగా ఇచ్చిన నిఘా హెలికాప్టర్లతో సహా, ఈ హెలికాప్టర్లను నిర్వహిస్తున్న 80 మంది భారతీయ సిబ్బంది ఆ దేశాన్ని వదలి వెళ్లేదాకా పట్టుబట్టాడు. అధికారంలోకి రాగానే చైనా పర్యటన పెట్టుకుని, ఆ దేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నాడు. నిజానికి ఏ మాల్దీవుల అధ్యక్షుడైనా, గెలిచిన తర్వాత తన తొలి పర్యటనను ఇండియాలో పెట్టుకుంటాడు. కానీ దీనికి విరుద్ధంగా ముయిజ్జూ చైనా, టర్కీల్లో పర్యటించాడు.

ఈ ఏడాది లక్షదీవుల పర్యటనకు ప్రధాని వెళ్తే, ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు కొందరు అసభ్యకరమైన విమర్శలు చేశారు. ఫలితంగా మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకులు తగ్గిపోయారు. చాలా ట్రావెల్ ఫ్లాట్‌ఫారమ్స్ మాల్దీవుల బుకింగ్స్‌ని నిలిపేశాయి. ఈ సమయంలో కూడా ఆ దేశం చైనా నుంచి తమ దేశానికి పర్యాటకుల్ని పంపాలని కోరింది. భారత్‌తో మాకు అసవరం లేదనట్లుగా వ్యవహరించింది. అయితే, చైనా నుంచి పర్యాటకులైతే వచ్చారు, కానీ వారు భారతీయులు ఖర్చు చేసేలా ఖర్చు పెట్టకపోవడంతో అసలు విషయం బోధపడింది. తిరిగి చూసే సరికి ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం రెండూ కుప్పకూలాయి. మాల్దీవులు ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడింది. కోవిడ్ సమయంలో కూడా మాల్దీవుల్ని ఆదుకుండి భారతీయ పర్యాటకులే.

Tags:    

Similar News