USA: వుహాన్ ల్యాబ్ కి ఇకపై నిధులు నిల్
ఫెడరల్ నిబంధనలు పాటించకపోవడమే కారణం;
కరోనా ప్రభంజనానికి కారణమై ప్రపంచాన్ని గడగడ లాడించింది అన్న ఆరోపణలు ఎదుర్కొన్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ కు అమెరికా నిధులను నిలిపివేసింది. ల్యాబ్లో భద్రతా చర్యలకు సంబంధించి తాము కోరిన పత్రాలు సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ నోటిఫై చేసింది. వుహాన్ ల్యాబ్ కు కూడా తెలియజేసింది.
గత ఏడాది సెప్టెంబర్ లోనే వుహాన్ ల్యాబ్ ఫెడరల్ నిబంధనలు పాటించకపోవడం అన్న విషయం పై సమీక్ష మొదలుపెట్టినట్టు తెలిపింది. నిజానికి కోవేట్ వ్యాప్తి మొదలైన రోజుల నుంచి ఈ ల్యాబ్ కు నిధులు ఆగిపోయాయి. కొన్ని లక్షల మంది మరణాలకు కారణమైన కోవిడ్ వ్యాప్తి గురించి లోతుగా పరిశీలించడానికి ఎప్పుడైతే చైనా అనుకూలంగా లేదు అప్పటి నుంచే అమెరికా చైనాకు వ్యతిరేకంగా మారింది.
దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ఇది మొదటిసారిగా 2019 డిసెంబరులో వుహాన్ నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో బయటపడింది. అయితే ఇది చాలా భయంకరమైనది అనే విషయాన్ని చైనా దాచిపెట్టింది. సుమారు రెండు నెలల వరకూ విషయం బయటకు రానీయకుండా తెలివిగా వ్యవహరించింది. వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకోడానికి కూడా ససేమిరా అంది. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. వుహాన్ నుంచి మిగతా దేశాలకు మహమ్మారి వ్యాప్తి చెంది లక్షల్లో ప్రాణాలు హరించింది.
మొదట్లో కరోనాను చైనా వ్యాప్తి చేసింది అన్నది కాస్త అనుమానం గానే ఉండేది. చైనా కూడా ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ.. కౌంటర్ విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కోవిడ్ మహమ్మారి వుహాన్ ల్యాబ్ నుంచి పుట్టిందనడానికి ఆధారాలు దొరకలేదు అని అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన ఓ నివేదిక కూడా వెలువడటంతో, ఇది చైనా కావాలనుకుని చేసిన పని కాదని అందరూ అభిప్రాయపడ్డారు అయితే తాజాగా, కరోనా వైరస్ గురించి వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అంటించేందుకు తయారు చేసిన జీవాయుధమని ఆయన బాంబు పేల్చారు. ఒక వైరస్‌ను జీవాయుధంలా వాడుకునేలా చైనా మార్పులు చేసిందని వుహాన్ ల్యాబ్ పరిశోధకులు పేర్కొన్నారు.