UKRAINE_RUSSIA WAR: యుద్ధం... భీకరం... భయానకం
భీకరంగా మారిన ఉక్రెయిన్-రష్యా యుద్ధం... సవాళ్లు, ప్రతి సవాళ్లతో పెరిగిన ఉద్రిక్తతలు;
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. పరస్పర దాడులు, సవాళ్లతో యుద్ధం మరో దశకు వెళ్తోంది. డ్రోన్లతో ఇరు దేశాల ప్రధాన భూభాగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణుల దాడిలో ఏడుగురు పౌరులు మరణించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని రష్యాను హెచ్చరించారు. రష్యా దాడిలో గాయపడినవారి సంఖ్య 148కి చేరిందని చెర్నిహైవ్ అధికారులు తెలిపారు.
రష్యా సేనలు కుపియాన్స్క్‌పై జరిపిన మరో బాంబు దాడుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఖర్కీవ్ గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కుర్స్క్ నగరంలోని రైల్వేస్టేషన్‌పై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఐదుగురు గాయపడినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. డ్రోన్ దాడిలో రైల్వేస్టేషన్ భవనం పైకప్పు తీవ్రంగా ధ్వంసమైంది. ఆ తరువాత అక్కడ మంటలు చెలరేగాయి. తమపై ఉగ్రదాడి చేసేందుకు కీవ్ ప్రయత్నించిందని మరోసారి రష్యా రక్షణశాఖ అధికారులు ఆరోపించారు. డ్రోన్ దాడులు ముమ్మరం కావడంతో మాస్కో రెండు ముఖ్య విమానాశ్రయాల్లో సేవలను నిలిపివేసింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పెద్ద ట్యాంకర్లు, శతఘ్నులతో సమానంగా వీటికి ప్రాధాన్యత ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. ఈ క్రమంలో ఈస్టర్న్ ఉక్రెయిన్ యుద్ధభూమిలో డ్రోన్ ఇంటెలిజెన్స్ లేదా ప్రత్యేక నేత్రాల యూనిట్లను కీవ్ మోహరించింది. దట్టమైన అడవుల్లో ఈ విభాగం పనిచేస్తోంది. 20 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలపై వీరు నిఘా పెడుతున్నారు. ప్రత్యర్థి కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు. అవసరమైనప్పుడు దాడులు చేసేందుకు డ్రోన్లు సమర్థమంతంగా పనిచేస్తున్నట్లు కీవ్ దళాలు తెలిపాయి.
మరోవైపు విదేశీ పర్యటనల్లో భాగంగా జెలెన్‌స్కీ నెదర్లాండ్స్ వైమానిక స్థావరంలో ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయ్యారు. డెన్మార్క్ ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు అందిస్తామని జెలెన్‌స్కీకి రూట్ హామీ ఇచ్చారు. అంతకు ముందు వారిద్దరూ హేంగర్‌లో పార్క్ చేసిన రెండు ఎఫ్-16 యుద్ధవిమానాలను పరిశీలించారు. ఉక్రెయిన్‌కు 19 ఎఫ్-16 యుద్ధ విమానాలను అందిస్తామని తాజాగా డెన్మార్క్ వెల్లడించింది. తమ దేశ తయారీ యుద్ధ విమానం ఎఫ్-16ను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు అనుమతినిచ్చింది.