AP : జగన్ పై దేశద్రోహి కేసు పెట్టాలి - మంత్రి పయ్యావుల

తప్పుడు ప్రకటనలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ చీఫ్ జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్ కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రెస్‌మీట్‌లు పెడుతుంటే జగన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని విమర్శించారు. కుట్రలు పన్నుతున్నారనేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘నిధుల సమీకరణ కోసం ఏపీఎండీసీకి రూ.9వేల కోట్ల బాండ్లపై తప్పుడు ఫిర్యాదుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడాలనుకున్నారు. దీనిని అడ్డుకునేందుకు విదేశాల్లో పనిచేస్తున్న ఉదయ్‌భాస్కర్ అనే వైసీపీ అభిమానితో 200 మెయిల్స్ పెట్టించారు. పెట్టుబడిదారులు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో జగన్ సోషల్ మీడియాలో పోస్టులతో రంగంలోకి దిగారు. అవి కూడా వర్కౌట్ కాకపోవడంతో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో న్యాయస్థానంలో పిటిషన్ వేయించారు’’ అని పయ్యావుల ఆరోపంచారు.
జగన్ కుట్రల వల్ల 4 గంటల్లో రావాల్సిన ఆర్థికపరమైన అనుమతులు 15 రోజుల ఆలస్యంగా వచ్చాయని పయ్యావుల తెలిపారు. జగన్ హయాంలో తాకట్టుపెట్టి మరీ రుణాలు తీసుకున్న జాబితా బయటపెట్టాలా? అని ప్రశ్నించారు. అన్నీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com