AB Venkateswara Rao: ఆనాడు ఏ ప్రభుత్వ విభాగం పెగాసస్‌ను కొనలేదు, వాడలేదు: ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao: పెగాసస్ అంశంపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. పెగాసస్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో డీజీపీ, ఇంటెలిజెన్స్, సీఐడీ ఆఫీస్‌లు కానీ.. ఏ ప్రభుత్వ విభాగం కానీ పెగాసస్‌ను కొనలేదు, వాడలేదన్నారు. ఏపీ ప్రభుత్వ నిఘా చీఫ్‌గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని తెలిపారు.
వేరే విభాగాలు ఏమైనా కొన్నాయేమోనని తెలివిగల సూర్యులు ఆరోపిస్తున్నారన్నారు. అసత్యాలు, ఆరోపణలతో ప్రజల్ని గందరగోళంలోకి నెట్టొద్దన్నారు. ఎప్పుడూ కొనని, వాడని దానికి తనపై ఆరోపణలేంటని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. టైమ్ వేస్ట్ అన్నారు. తనపై జరిగిన విచారణ సమయంలో కొందరు అధికారులు.. తప్పుడు పత్రాలు సృష్టించి సాక్ష్యాలుగా పెట్టేందుకు విఫలయత్నం చేశారన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.
నాలుగు రోజులుగా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై.. పరువునష్టం దావా వేసేందుకు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగానన్నారు. ఆధారాలతో సహా అన్ని వివరాలు చెబుతానన్నారు. 25 కోట్ల కుంభకోణం జరిగిందన్నారని.. ఛార్జ్‌షీట్‌లో ఆ విషయం ఉందా? అని నిలదీశారు. తనను దేశద్రోహి అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు నిబద్ధతతో సర్వీస్ చేశానని తెలిపారు. దేశ రహస్యాలను విదేశాలకు చేరవేశానన్నారని.. ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాలేవని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com