AP VOTERS: ఓట్ల అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

AP VOTERS: ఓట్ల అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
దొంగ ఓట్లపై ఓటర్ల తీవ్ర ఆగ్రహం... ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లపై విస్మయం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో సవరణల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు రెండో రోజూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ ఓట్లు ఇతర పోలింగ్ కేంద్రాలకు, డివిజన్లకు మారడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే డోర్ నంబర్ మీద పదుల సంఖ్యలో దొంగ ఓట్లు , కొన్ని చోట్ల జాబితాలో మృతుల పేర్లు ఉండడంపై మండిపడ్డారు. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల పదేపదే బీఎల్వోల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో.. రెండో రోజూ అక్రమాలు వెలుగుచూశాయి. చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లను ఇంకా తొలగించలేదు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నంబరులో పదుల సంఖ్యలో ఓట్లు దర్శనమిచ్చాయి. గుంటూరు 45వ డివిజన్ గోరంట్లలోని నవీన స్కూల్ ప్రత్యేక శిబిరానికి వచ్చిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ ఓట్లను స్థానిక పోలింగ్ కేంద్రానికి మార్చాలని దరఖాస్తులు ఇచ్చారు. అధికారులు సరిగ్గా స్పందించలేదని ప్రశ్నించినందుకు తమ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకున్నారని...ఓ ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు.


గుంటూరులో 41, 45 డివిజన్లలో ఒకే డోర్ నెంబర్ తో కొత్త ఓట్లు భారీగా పుట్టుకువచ్చాయని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 45 డివిజన్ లో ఓ ఇంట్లో ఐదుగురు ఓటర్లు ఉంటే జాబితాలో 12 ఓట్లు దర్శనమిచ్చాయని ఆరోపించారు. 41 డివిజన్ లోనూ అదనపు ఓట్లపై సందేహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికారుల ఆలసత్వం వల్ల తమ ఓట్లు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోకి వెళ్లాయని వాపోయారు. తాడికొండ నియోజకవర్గంలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నవారు 1900 వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడు నుంచి పనుల కోసం తాడికొండకు వచ్చి తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయిన వారికీ జాబితాలో ఓట్లు కల్పించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఓటర్ల జాబితాపై కొందరు అభ్యంతరాలు తెలుపుతూ..అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. డబుల్‌ ఎంట్రీలు తొలగించాలని కోరారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గంలో అడ్రస్ మార్పుల కోసం 16 వందల 88 దరఖాస్తులు పెట్టుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఓట్లు జంబ్లింగ్‌ అయ్యాయి. ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తల పేర్లు వేర్వేరు పోలింగ్‌ బూత్‌ల్లో ఉన్నట్లు జాబితాలో కనిపించింది. తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో మృతుల పేర్లు ఇంకా జాబితాలోనే ఉన్నాయి. గొల్లపూడి, కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో బోగస్‌ పేర్లు గుర్తించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో డబుల్‌ ఎంట్రీలతో పాటు ఒకే ఇంటిలో 10 దొంగ ఓట్లు గుర్తించారు. నందిగామలోనూ ఓట్లు గల్లంతైనట్లు దరఖాస్తులు వచ్చాయి. డబుల్ ఎంట్రీలు, మృతుల పేర్ల తొలగింపులో అధికారుల తీరు సరిగ్గా లేదని విపక్ష పార్టీల ప్రతినిధులు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story