AP: అసంపూర్తిగానే ముగిసిన ఉద్యోగులు-మంత్రులు చర్చలు

AP: అసంపూర్తిగానే ముగిసిన ఉద్యోగులు-మంత్రులు చర్చలు
చర్చల్లో ఎలాంటి కొత్తదనం లేదన్న మంత్రుల కమిటీ... మరోసారి చర్చించుకుని స్పష్టత ఇస్తామన్న మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులతో... మంత్రుల కమిటీ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. మరోసారి భేటీ కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. చర్చల్లో ఎలాంటి కొత్తదనమూ లేదని.., కేవలం ప్రభుత్వం తమకు ఎంత బకాయిలు ఉందో మాత్రమే స్పష్టత వచ్చిందని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు. 21వేల కోట్ల బకాయిలకు గాను మార్చి 31లోపు 5 వేల 500 కోట్ల చెల్లింపులకు మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కాకపోవడంతో... ఈ నెల 26న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై జగన్‌ సర్కార్‌ పాతపాటే పాడటంతో ఉద్యోగ సంఘం నేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.


ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరగా చెల్లించడం కంటే వాయిదా వేసేందుకే చర్చలు నిర్వహించినట్లు కనిపించింది. ఎప్పుడో ఆదాయ పన్ను చెల్లించి నాలుగేళ్ల నుంచి గ్రీన్‌ ఛానల్‌లో ఉన్న 2018-19 డీఏ బకాయిలను గతేడాది సెప్టెంబరులో చెల్లిస్తామని ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు వాటిని జూన్‌లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్‌ వచ్చేస్తుంది. కానీ... మంత్రుల కమిటీ మాత్రం చెల్లింపులను మార్చి 31లోపు అంటూ కొత్త హామీ ఇచ్చింది. 11వ PRC గడువు 2023 జులైతో ముగిసినందున... 12వ PRCకి సంబంధించి మధ్యంతర భృతి చెల్లించాలని నాయకులు కోరినా... ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. మరోసారి చర్చించుకుని ఐఆర్‌పై స్పష్టత ఇస్తామని మంత్రుల కమిటీ వెల్లడించింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు కలిపి మొత్తం 21 వేల కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పుడు 12వ పీఆర్సీ వస్తే ఈ బకాయిలు మరింత పెరగనున్నాయి. చర్చల్లో ఎలాంటి కొత్తదనం లేదని ఎప్పుడూ జరిగినట్లే సాగాయని... ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎప్పటిలోపు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని... ఏపీ ఐకాస ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, హృదయరాజు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story