SUSPEND: అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ

SUSPEND: అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ
విజయవాడ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు.... ఓట్ల అక్రమాలకు సహకరించినందుకు సస్పెన్షన్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్నమయ్యజిల్లా కలెక్టర్ గిరి షాను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడను వదిలి వెళ్లొద్దని గిరి షాను సీఎస్ ఆదేశించారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్వోగా గిరి షా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారిగా లాగిన్ దుర్వినియోగ పరిచారని ఆయనపై అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్, ఐపీఎస్ పై కూడా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇంతకీ ఏం జరిగిందంటే...?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత భాజపా ఫిర్యాదుతో... అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషాపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఓటరు జాబితాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ప్రతిచోటా సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వైసీపీకు జీతగాళ్లుగా వ్యహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. కేవలం కంటి తుడుపు చర్య కింద ఒకరిద్దరిపైన కాకుండా అధికార అండతో అక్రమాలకు పాల్పడినా అందరిపైనా కొరడా ఝళిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


వైసీపీకి తాబేదార్లుగా వ్యవహరిస్తూ... ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడుతున్న పలువురు అధికారులకు ఈసీ చర్య చెంపపెట్టు లాంటిది. 2021లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులు... వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి అక్రమంగా డౌన్‌లోడ్‌ చేశారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్న వ్యవహారంలో... వారికి సహకరించిన ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా పనిచేసిన గిరీషా... లోక్‌సభ ఉప ఎన్నికకు ఈఆర్‌ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆయన లాగిన్‌ ఐడీ ద్వారా దాదాపు 30 వేలకుపైగా ఎపిక్‌ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్‌ చేశారు. వాటిపై ఫొటోలు మార్ఫింగ్‌ చేసి... దొంగ ఓట్లు వేశారని, స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి. SPOT...

గిరీషా ఐడీతో వేల సంఖ్యలో ఎపిక్‌ కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెండ్‌ చేశారు. ఎపిక్‌ కార్డుల డౌన్‌లోడ్‌ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైనా చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్‌ను... రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు రెండేళ్ల తర్వాత, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఫిర్యాదుతో ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకుంది..

Tags

Read MoreRead Less
Next Story