AP: ఉద్యోగులూ.. టీడీపీ కార్యకర్తలను మర్యాదగా చూసుకోండి

AP: ఉద్యోగులూ.. టీడీపీ కార్యకర్తలను మర్యాదగా చూసుకోండి
ఏపీ వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు... టీ ఇచ్చి గౌరవించాలని వినతి...

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు జోష్‌ పెంచాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల పనులు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకుంటారని అచ్చెన్న అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలను మర్యాదగా చూసుకోవాలని తాను ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని... మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని తాను దారిలోకి తెస్తానని అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల విజయోత్సవ ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి అచ్చెన్న పాల్గొన్నారు.

అవమానాలకు గురయ్యాం

జగన్ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారని అచ్చెన్న అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా తాను సమావేశం పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తానని అన్నారు. తెలుగుదేశం నేతలు ఏ అధికారి వద్దకైనా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లాలని అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అధికారులు వారికి గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, వచ్చిన పని ఏంటని అడిగి మరీ పనులు చేసి పెడతారని అన్నారు. ఎవరైనా ఒకరిద్దరు తన మాట వినకపోతే వాళ్లు ఏమౌతారో వారికి బాగా తెలుసునని, తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

రేషన్‌ దుకాణాల్లో కందిపప్పు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ పాలనలో ఏడాది నుంచి కందిపప్పు పంపిణీని నిలిపివేయడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదలకు కందిపప్పు, పంచదార సరఫరా చేయాలని భావిస్తున్న్టలు తెలుస్తోంది.

కందిపప్పును వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో దానిని మళ్లీ పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి వచ్చింది. సత్వరమే సరఫరా మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. కందిపప్పును కొనుగోలు చేసి చౌక సరఫరాదారుల దుకాణాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఎల్లుండి( గురువారం) నుంచి బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను రేషన్‌ షాపులకు సరఫరా చేయాల్సి ఉంది. జులై 1వ తేదీ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కందిపప్పు, చక్కెరతో పాటు అక్కడి సరుకుల నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags

Next Story