AP: ఏపీలో కూటమి ప్రభంజనమే

AP: ఏపీలో కూటమి ప్రభంజనమే
స్పష్టం చేసిన మెజార్టీ సర్వేలు... వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అంచనా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి, దేశంలో భారతీయ జనతాపార్టీ కూటమి జయభేరి మోగిస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వేశాయి. ఏపీలో.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయదుంధుభి మోగిస్తుందని స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని తెలిపాయి. ఏపీలోని 25లోక్‌సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమి అత్యధిక సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనావేశాయి.ఆంధ్రప్రదేశ్‌లో మెజార్జీ ఎగ్జిట్‌పోల్స్తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే పట్టంకట్టాయి. కూటమి గెలుపు ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ సంస్థ.... తెలుగుదేశంకు 95 నుంచి 110, జనసేనకు 14నుంచి 20, భాజపాకు 2నుంచి 5 MLA స్థానాలు వస్తాయని తెలిపింది. అధికార వైసీపీ 45నుంచి 60 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వేలో కూటమికి 114నుంచి 125 స్థానాలు, వైకాపాకు 39నుంచి 49 స్థానాలు వస్తాయని తెలిపింది.

ఇతరులు ఒక స్థానంలో గెలవచ్చని అంచనా వేసింది. రైజ్‌ సర్వే సంస్థ తెలుగుదేశంకు 92నుంచి 99, జనసేన 11నుంచి 16, భాజపా 3స్థానాల్లో గెలవబోతోందని తెలిపింది. వైసీపీకి 48 నుంచి 60స్థానాలు రావొచ్చని పేర్కొంది. కేకే సర్వే తెలుగుదేశంకు 133, జనసేన 21, బీజేపీ 7స్థానాల్లో విజయం సాధించబోతోందని తెలిపింది. మొత్తంగా కూటమి 151 స్థానాలు సాధిస్తుందని కేకే సర్వేలో తేలింది. వైసీపీకి కేవలం 14 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. పయనీర్‌ సంస్థ సర్వేలో కూటమికి 144, వైకాపాకు 31స్థానాలు రావొచ్చని తెలిపింది. జనగళం సంస్థకూటమికి 104నుంచి 118స్థానాలు, వైకాపాకు 44 నుంచి 57 స్థానాలు రాబోతున్నాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. వివిధ మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ పోలింగ్‌ తగినట్లుగానే ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి.

Tags

Next Story