AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత సభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు సభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఈ సమావేశాలకు స్థలాభావంతో సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. కాగా ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇంగ్లిష్ అక్షరాల వరుసక్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. సభకు వైసీపీ అధినేత వస్తారా? రారా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాసులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ఏపీ శాసనసభ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులు రద్దు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాసులు ఇవ్వట్లేదని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com