AP ASSEMBLY: ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ

AP ASSEMBLY: ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ
శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!... డిప్యూటీ స్పీకర్‌ జనసేనకు..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవే తొలి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు.. ఆ శపథం నెరవేర్చుకుని ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఇందులో టీడీపీకి 135 స్థానాలు, జనసేనకు 21, బీజేపీకి 9 సీట్లు దక్కాయి. ఇక వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలుపొందింది. జనసేన అధినేత పవన్‌ రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

అచ్చెన్న కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు జోష్‌ పెంచాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల పనులు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకుంటారని అచ్చెన్న అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలను మర్యాదగా చూసుకోవాలని తాను ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని... మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని తాను దారిలోకి తెస్తానని అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల విజయోత్సవ ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి అచ్చెన్న పాల్గొన్నారు.

అవమానాలకు గురయ్యాం

జగన్ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురయ్యారని అచ్చెన్న అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా తాను సమావేశం పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తానని అన్నారు. తెలుగుదేశం నేతలు ఏ అధికారి వద్దకైనా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లాలని అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అధికారులు వారికి గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి, వచ్చిన పని ఏంటని అడిగి మరీ పనులు చేసి పెడతారని అన్నారు. ఎవరైనా ఒకరిద్దరు తన మాట వినకపోతే వాళ్లు ఏమౌతారో వారికి బాగా తెలుసునని, తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags

Next Story