CBN: పాలనలో సమగ్ర ప్రక్షాళన

CBN: పాలనలో సమగ్ర ప్రక్షాళన
X
తన మార్క్‌ పాలనతో ముందుకెళ్తున్న చంద్రబాబు... అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన వ్యవస్థలను తిరిగి ప్రక్షాళన చేస్తున్నారు. సీనియర్ IAS శ్యామలరావును తిరుమల తిరుపతి దేవస్థానం EOగా నియమించి పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. పాలనలో సమగ్ర ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత కసరత్తు చేస్తున్నారు. జగన్‌ జమానాలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను CMO ఇప్పటికే సిద్ధం చేసింది. వైసీపీ అంటకాగిన వారిని దూరంగా పెట్టి.. సమర్థులు, నిజాయతీపరులుగా పేరున్న అధికారులకు చంద్రబాబు కీలక పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, డీజీపీ, సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. జగన్‌ ఏలుబడిలో వైసీపీ సేవలో తరించారని ఆరోపణలు ఆరోపణల ఎదుర్కొంటున్న ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని సాధారణ పరిపాలనాశాఖలో రిపోర్ట్ చేయమంటారనే చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాథ్‌రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలోనూ ప్రస్తుత ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానేచంద్ర బాబు చేసిన 5సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలని, నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. పాలనలో మార్పు కనిపించాలని, కొత్త ప్రభుత్వం మార్క్ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించి వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చిచెప్పారు. పోలవరంతో తనక్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని ప్రకటించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికివస్తానని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.

Tags

Next Story