CBN: నేను అప్పటి చంద్రబాబునే

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. టీడీపీ క్యాడర్‌కు చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. పార్టీలో మెరిట్ ఉన్న వాళ్లకే పదువులు ఇస్తున్నామన్నారు. ‘మళ్లీ మళ్లీ చెబుతున్నా.. నేను 2014 నాటి చంద్రబాబు సీఎంను కాదని, 1995 నాటి చంద్రబాబును’ అని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నామని కక్షలు తీర్చుకోనని.. కానీ తప్పులు చేస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇసుక అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు కీలక హెచ్చరికలు చేశారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు. మద్యం కూడా MRP ధరలకే విక్రయించాలని తెలిపారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే.. ఊరుకునేది లేదన్నారు. వీటి విషయంలో ఎలాంటి రాజీ లేదని, ఒక్కరూపాయి కూడా అవినీతి జరగొద్దని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘టీడీపీ పనైపోయిందన్న వాళ్ల పనైపోయింది. పార్టీయే శాశ్వతం. టీడీపీకి ముందు.. ఆ తర్వాత అన్నట్లు తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తల మనోభావాలు గౌరవించే పార్టీ టీడీపీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా పెట్టిన పార్టీ ఇది’ అని పేర్కొన్నారు.
తప్పులు చేస్తే వదలను
రాజకీయ ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే వదిలిపెట్టబోనని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత అంశాలను పార్టీ కక్షల రూపంలో తీర్చుకుంటామంటే కుదరదని... దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. ప్రజలకు మన పట్ల ఉన్న విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా కష్టమైన పని అని చంద్రబాబు అన్నారు. కానీ, దానిని పొగొట్టుకోవడానికి రెండు నిమిషాలు చాలన్నారు. టీడీపీ కోసం జెండాలు మోసి, త్యాగాలు చేసిన కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు. నమ్మి మనకు అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.
టీడీపీతోనే గుర్తింపు
తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని చంద్రబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా తొలి సభ్యత్వ కార్డును చంద్రబాబు అందుకున్నారు. సభ్యత్వ నమోదు కరపత్రాన్ని విడుదల చేశారు. వైసీపీ నేతల దాడిలో ప్రాణాలు కోల్పోయిన, దాడులకు గురైన, ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలతో ఆయన జూమ్‌కాల్ ద్వారా మాట్లాడారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీని భావితరాల వారికి అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మొన్నటి ఎన్నికల్లో మన శక్తి ఏంటో చూపించామని... సామాజిక సమీకరణాలతో ముందుకెళ్లి అన్ని కులాలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. మొన్న జరిగింది ఎన్నికలు కాదు.. రాక్షసుడితో యుద్ధం అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com